28న హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ కార్మికుల సమ్మె

* ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన 


* అంతకుముందే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు..!


                               రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కో ప్రభుత్వ సంస్థను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ సర్కారు.. - తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్)లనూ ప్రయివేటీకరించడానికి తీసుకున్న నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిని నిరసిస్తూ వచ్చే నెల 28న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ల చేతికి అప్పగిస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఈ నెల 26న ముంబయిలో జరిగిన జాతీయ సమావేశంలో తీర్మానించారు. సమ్మెలో ఇంధన సంస్థలకు చెందిన రిఫైనరీ, మార్కెటింగ్, పైప్ లైన్లకు చెందిన ప్రభుత్వ, కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటారని ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. బీపీసీఎల్ లో కేంద్రానికి ఉన్న 53.29 శాతం వాటా, హెచ్ పీసీఎల్ లో 51.11 శాతం వాటాతో పాటు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఏఎంఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో షేర్లనూ ప్రయివేటు వ్యక్తులకు అమ్మడానికి గతనెల 30న ఆయా సంస్థల సెక్రెటరీల సమావేశం జరిగింది. అంతకుముందు జులై 5న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ - ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల్లో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రైల్వే, రక్షణతో పాటు పలు కీలక ప్రభుత్వ సంస్థలను నష్టాల సాకు చూపి ప్రయివేటుపరం చేయాలని చూస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో దాదాపు 75 శాతం వ్యాపారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ చేతిలోనే ఉన్నది. పెట్రో ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేసిన తర్వాత ప్రయివేటు ఇంధన సంస్థలు ఇష్టారీతిన ధరలను పెంచుతున్న విషయం తెలిసిందే. దీని పర్యావసానమే ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని తగ్గించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేసిన బీజేపీ... అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల నియంత్రణను మరింత కఠినం చేసింది. కాగా పెట్రోలియం ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో బీపీసీఎల్ వాటా 24 శాతం ఉన్నది. ఒకవేళ కేంద్రం తన వాటాను అమ్ముకుంటే కార్పొరేట్ శక్తులు తమకు నచ్చినట్టుగా ధరలను పెంచుకుంటాయనీ, దాంతో ప్రజలకు ధరలు అదుపులో ఉండటం కష్టమని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూనే తాము నిరసనలకు దిగుతున్నామని వారు తెలిపారు. సమ్మెతో పాటు వచ్చే నెల 11 నుంచి వారం రోజుల పాటు ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ), ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) హాజరుకాగా.. శివసేన అనుబంధ కార్మిక సంస్థ సేన కాంగార్ ఫెడరేషన్ (ఎస్ కేఎఫ్) మద్దతు ప్రకటించింది.