ఆదివాసీలతోనే మేడారం ట్రస్టు బోర్డు

                             మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినా, ఈ జాతర పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. మేడారం దేవస్థానానికి రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిని కూడా ఈ ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం దేవస్థానం ఇన్‌ఛార్జి ఇవోగా టి. రాజేంద్రం వ్యవహరిస్తున్నారు. రాజేంద్రం కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఈవోగా పని చేస్తున్నారు. ప్రస్తుత ఈవో రాజేంద్రం కంటే ముందు గతంలో రెండు జాతరలకు ఇన్‌ఛార్జి ఇవోగా నాటి దేవాదాయ డిప్యూటీ కమిషనర్ టి. రమేశ్ బాబు వ్యవహరించారు. మేడారం దేవస్థానానికి పూర్తిస్థాయి కార్యనిర్వహక అధికారిని నియమించకపోవడంతో అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేసే అవకాశాలు లేకుండాపోయాయి. ఇదిలావుంటే ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలో కేవలం ఆదివాసీలు మాత్రమే ట్రస్టీలుగా నియమిస్తున్నారు. అదే తరహాలో మేడారం ట్రస్టు బోర్డులో ఆదివాసీలను మాత్రమే ట్రస్టీలుగా నియమించాలన్న డిమాండను ఆదివాసీ సంఘాలు తెరమీదకు తీసుకువచ్చాయి.


బోర్డులో 12 మంది ఆదివాసేతరులే..


                            మేడారం ట్రస్టుబోర్డును 14మందితో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 28, 2017న నియమించింది. ఇందులో చైర్మెన్ కాక లింగయ్య, ధర్మకర్త ఇర్ప సూరయ్య మాత్రమే ఆదివాసీలు. మిగతా వారంతా ఆదివా సేతరులే కావడం గమనార్హం. మేడారం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కాక లింగయ్య గత జాతర నుంచి ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నారు. చైర్మెన్ కాకుండా ధర్మకర్తలుగా లొడంగి లింగయ్య, దడిగెల సమ్మయ్య, కోట నర్సింహులు, కొంపెల్లి రమణారెడ్డి (రెడ్డి), ఎస్. సాంబలక్ష్మి, అజ్మీరా జవహర్ లాల్ (లంబాడీ), సూరపనేని సాయికుమార్ (కమ్మ), దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (రెడ్డి), ఇర్ప సూరయ్య (ఆదివాసీ), దూలిపాల సుబ్బారావు (కమ్మ, కూరవెల్ల రజిత, పి. సంజీవి, మహంకాళి రాజేశ్వర్ రావు, సిద్ధబోయిన జగ్గారావు (ఎక్స్ అఫిషియో)లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1968లో మొదటిసారి మేడారం ట్రస్టుబోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాడు ములుగు ఎమ్మెల్యేగా వ్యవహరించిన సంతోష్ చక్రవర్తి మొదటి ఛైర్మన్ గా నియమితులయ్యారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సంతోష్ చక్రవర్తి మూడుసార్లు చైర్మెన్‌గా వ్యవహరించడం గమనార్హం. టీడీపీ హయాంలో 1983-86మధ్య ట్రస్టు బోర్డు చైర్మెన్ గా మొదటిసారి ఆదివాసీనేత చర్చ భోజారావు నియమితులయ్యారు. అనంతరం 1986-89 మధ్య భవర్ లాల్ లాహోటి ఛైర్మన్‌గా వ్యవహరించారు. తరువాత 1992నుంచి నేటి వరకు ట్రస్టు బోర్డు చైర్మెన్లుగా ఆదివాసీ నేతలే నియమితులవుతూ వస్తున్నారు. అయితే చైర్మెన్ మినహా మిగతా ధర్మకర్తలందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసేతరులనధికంగా నియమించడం పట్ల ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు.మేడారం ట్రస్టు బోర్డును అధికార పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. దీంతో ఆదివాసీ నేతలు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2017లో టస్టు  బోర్డు  నియామకంలో 14మందిలో 12మంది ఆదివాసేతరులను నియమించడం ఇందుకు తార్కాణంగా ఆదివాసీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీలను మాత్రమే బోర్డులో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.


టీఆర్ఎస్ లో  విభేధాలు


                                 ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్న విభేధాల నేపథ్యంలో మేడారం ట్రస్టు బోర్డు నియామకంపై ఆ ప్రభావం పడే అవకాశముంది. ములుగు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అజ్మీరా చందూలాల్ ఓటమి పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో చందూలాల్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మేడారం జాతర 2020 ఫిబ్రవరిలో జరుగ నుండడం, మేడారం ట్రస్టు బోర్డును ప్రకటించాల్సిన సందర్భం రావడంతో టీఆర్ఎస్ లో వర్గపోరు మరోమారు భగ్గుమనే అవకాశమున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ములుగు టీఆర్ ఎస్ విభేదాలు మేడారం ట్రస్టుబోర్డు నియమాకంపై పడే అవకాశముందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఆదివాసీల మనోభావా కనుగుణంగా నియమిస్తుందన్నది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.